కన్నడ రాజ్య రమా రమణ, మూరురాయరగండ, ఆంధ్రబోజ..
సాహితీ సమరాంగణ సార్వభౌమా. విజయనగర సామ్రాజ్యాదీశా... శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయ.
అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి.. ఆ పేరు వింటే పులకించని జన్ముండదు దక్షిణ భారతాన. ఆయన కీర్తి నెమరువేసుకుంటేనే వెన్నులో వేల వాట్ల విద్యుత్ పుట్టి, నరాల్లో జీవం పుడుతుంది. రక్తం అభిమానంతో మరుగుతుంది. ఆయన గురించి రాయడం మొదలుపెడదామంటే ఎక్కడ, ఏ విషయం మీద రాయాలో పాలుపోవటం లేదు. అటు యుద్దభూమిలో శత్రువులను తరిమి తరిమి కొట్టిన ఆ శౌర్యమా? యుద్దం అయ్యాక అదే యుద్దభూమికి వచ్చి క్షతగాత్రులందరినీ తీసుకెళ్ళి సొంతమనిషి కూడ చేయని పరిచర్యలు చేసే ఆ ఔదార్యమా? సమర రంగాన సైతం విరామ సమయాల్లో కవి దిగ్గజాలతో అలరారే ఆ నిరుపమాన కళాపోషణా? సంస్కృత, తెలుగు, కన్నడ, తమిళ ప్రజల ఉనికిని చాటి, ఈ దేశ సంస్కృతిని తనతరం, తదనంతరం విరాజిల్లేలా దిద్దిన ఆ కౌశలమా? ఇలా అడుగుతూ పోతే ఎన్నయినా వస్తాయి.