అహో... ఆంధ్రబోజ!
కన్నడ రాజ్య రమా రమణ, మూరురాయరగండ, ఆంధ్రబోజ..
సాహితీ సమరాంగణ సార్వభౌమా. విజయనగర సామ్రాజ్యాదీశా... శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయ.
అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి.. ఆ పేరు వింటే పులకించని జన్ముండదు దక్షిణ భారతాన. ఆయన కీర్తి నెమరువేసుకుంటేనే వెన్నులో వేల వాట్ల విద్యుత్ పుట్టి, నరాల్లో జీవం పుడుతుంది. రక్తం అభిమానంతో మరుగుతుంది. ఆయన గురించి రాయడం మొదలుపెడదామంటే ఎక్కడ, ఏ విషయం మీద రాయాలో పాలుపోవటం లేదు. అటు యుద్దభూమిలో శత్రువులను తరిమి తరిమి కొట్టిన ఆ శౌర్యమా? యుద్దం అయ్యాక అదే యుద్దభూమికి వచ్చి క్షతగాత్రులందరినీ తీసుకెళ్ళి సొంతమనిషి కూడ చేయని పరిచర్యలు చేసే ఆ ఔదార్యమా? సమర రంగాన సైతం విరామ సమయాల్లో కవి దిగ్గజాలతో అలరారే ఆ నిరుపమాన కళాపోషణా? సంస్కృత, తెలుగు, కన్నడ, తమిళ ప్రజల ఉనికిని చాటి, ఈ దేశ సంస్కృతిని తనతరం, తదనంతరం విరాజిల్లేలా దిద్దిన ఆ కౌశలమా? ఇలా అడుగుతూ పోతే ఎన్నయినా వస్తాయి.
రాయలు ఏ దండయాత్ర చేసినా అది ఖచ్చితంగా నెగ్గుకొచ్చేవాడని ప్రతీతి. సైనికుల కోసం ప్రత్యేకంగా, శత్రువులను చేరే మార్గాలలో కొండలను సైతం కరిగించి రోడ్లు వేయించడం, వారికి పెద్ద పెద్ద తమగాలు(చాలా పొడవైన,వెడల్పాటి చక్రాల బండి) చేయించడం లాంటివి చేసేవాడు. ఒకసారి రాయచూర్ దండయాత్రలో విజయనగర సైనికులు కొంతమంది పిరికితనంతో పారిపోతుంటే, వారిని రెచ్చగొట్టడానికి వాళ్ళతోనే యుద్దానికి పూనుకున్నాట్ట. చివరికి వాళ్ళళ్ళో ఎంత గుండెబలం నింపాడంటే, చిత్తుచిత్తుగా ఓడిపోవల్సిన యుద్దం కాస్తా, ఘనవిజయంగా ముగిసింది. "కొండవీడు మనదేరా , కొండపల్లి మనదేరా. కాదనువాడుంటే , కటకం దాకా మనదేరా!" అంటూ తన ప్రజలు పాడితే, తనకి సాటిలేదనిపించేలా నిజం చేశాడు ఆ మాటల్ని. ఆయన 1509-1529 కాలంలో సుభిక్షంగా, శాంతి భద్రతలతో పరిపాలించిన ప్రదేశాన్ని క్రిందనున్న పటంలో చూడవచ్చు(పటం మూలం:వికిపిడియా). విజయనగరం అంటే మన శ్రీకాకుళం దగ్గరిది కాదండోయ్, పటంలో ఆ చుక్కుంది చూశారా.. హంపి దగ్గర, అది. తుంగభద్ర తీరాన ఉంది ఆ పట్టణం.
ఇక రాయల కళాపోషణ గురించి నేను కొత్తగా చెప్పేదేముంది? భువన విజయం నెలకొల్పి అష్టదిగ్గజాలను పోషించాడు. వాళ్ళనే కాక ఇంకా ఎంతో మంది కవులు, కళాకారులు ఉండేవారట ఆయన రాజ్యంలో. ఆయన ఎన్నో కళాకండాలు సృష్టించాడు. హంపి వద్దనున్న శిధిలాలను చూసి ముక్కున వేలేస్కుంది లోకం. అక్కడి శిల్పాల అందం వర్ణణాతీతం. అక్కడ స్థంబాలను తడితే సంగీతం పుడుతుందట(చూస్తారా?). అక్కడ ప్రతి అణువూ ఒక్కో కధ చెబుతుందట. 'అట' ఎందుకంటే నేనింకా హంపి వెళ్ళలేదు. ఫోటోలు చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు.
సరదాగా కాసేపు ఆయన పెళ్ళి విషయాల్లో ఉన్న చాలా ఆసక్తికరమైన ఘట్టాలు చూద్దాం. రాయలు యాదవ వంశమని, ఆయన రాజైనప్పటికీ ఏ క్షత్రియుడు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. అందుకని, అప్పాజీ, గజపతి రాజుని కలిసి తన కూతురిని రాయలకిచ్చేలా వాగ్దానం చేయించుకుంటాడు. కాని ఈ మాట విన్న గజపతి అంతఃపుర స్త్రీలు ససేమిరా ఒప్పుకోము అని, అంతగా కుదరక పోతే రాయలను చంపైనా సరే పెళ్ళి ఆపాలని నిశ్చయించుకుంటారు. పెళ్ళయ్యేవరకు అప్పాజీ రాయల వెన్నంటే ఉండి, వాళ్ళ జిత్తులన్నీ కనిపెట్టి తప్పించటం వల్ల మొత్తానికి పెళ్ళవుతుంది. కాని తొలిరాత్రి పెళ్ళికూతురు మొలలో కత్తి పెట్టుకుని వస్తుంది. ఆమె చీరకొంగు రాయల కాలికింద పడడంతో కత్తి బయటపడుతుంది. చివరికి, రాయలు ఆమెకి పెళ్ళిష్టం లేదని తెలుసుకుని పుట్టింటికి వెళ్ళిపోమంటాడు. కాని అభిమానం చంపుకోలేక ఆమె ఒక ఆశ్రమంలో జీవిస్తుంది. చాలకాలం తర్వాత త ఆమె రాయలకు కొన్ని పద్యాలు పంపిస్తుంది. అలా తనకు, ఆమెకు సాహిత్య సంభాషణలు మాత్రం జరిగేవి. ఆమె పేరు వరదరాజమ్మ. ఈ కథకి అంత గట్టి పునాది లేదు. ఎందుకంటే గజపతికి వరదరాజమ్మ అనే కూతురు ఉందని ఎక్కడా లేదు. పైగా వరదరాజమ్మ అచ్యుతదేవరాయుల పట్టపురాణి అని కూడ ఇంకోచోట ఉంది. కాని ఇంకో కథ ఉంది. ఇది మాత్రం చాలా గట్టి పునాది ఉన్నదే. ఉత్కలదేశాన్ని జయించినప్పుడు, ఉత్కలరాజు సంది కోరుతాడు. తన కూతురినిచ్చి పెళ్ళి చేస్తే సందికి సరేనంటాడు రాయలు. కాని ఆ రాకుమారికి ఇందాకటి కథలోలాగానే రాయలంటే గిట్టదు. ఈ విషయం అప్పాజీకి తెలుసు. కాని పెళ్ళైపోతుంది. అప్పాజీ, తేనెతో చేయించిన రాయల విగ్రహాన్ని శోభనం గది లో పెట్టించి, రాయలు అలసిపోయాడు, లేపవద్దని చెప్పి చెలికత్తెలందర్నీ పంపేస్తాడు. రాయలు పడుకున్నాడన్న విషయం ఆ రాకుమారికి తెలిసి, వెళ్ళి ఒక్క పోటు పొడుస్తుంది. ఆమె మీద తేనె చిమ్మడం, అవాక్కవ్వడం, అప్పాజి వచ్చి, రాయల్ని పిలిపించి ఇద్దరికీ చెలిమి కుదర్చడం జరిగిపోతాయి. ఆమె పేరు తిరుమలదేవి, రాయల పట్టపురాణి! (మూలం:శ్రీకృష్ణదేవరాయ వైభవం - తెలుగు సమితి) [ ఆసక్తి గలవార్కి, ఇది EMESCO వారి ప్రచురణ. ఐఐఐటిలో ఐతే, ఈ పుస్తకం మన గ్రంధాలయం లో ఉంది - T954.84 Sr31_ ]
ఇంకా చాలా చాలా కధలున్నాయి ఆయన గురించి. కానీ అంతా రాయడం కష్టం కదా..
చివరిగా, "ముఖ్యంగా", ఒక్క మాట. రాయల కాలంలో కేవలం దేశీయ వర్తకులనే కాకుండా, బయట దేశాల వర్తకులను కూడా ప్రోత్సహించేవాడు. అన్ని మతాల, జాతుల, కులాల వారు ఏ గొడవ లేకుండా సంతోషంగా జీవించారు. ఆనాటి దేశదేశాల వర్తకులు, వాళ్ళ తర్వాతి తరాల వారు కొంతమంది ఆ విజయనగర సామ్రాజ్య ప్రగతిని, పురోగతిని ఎంతగా కీర్తించారంటే, I will have to quote that in their own words (source : A Forgotten Empire: Vijayanagar : Robert Sewell) [ఆసక్తి గలవారు, ఆ ఈ-పుస్తకం నాదగ్గర ఉంది, అడిగి తీసుకోవచ్చు.]
"... and yet in the present day the very existence of this kingdom is hardly remembered in India; while its once magnificent capital, planted on the extreme northern border of its dominions and bearing the proud title of the "City of Victory," has entirely disappeared save for a few scattered ruins of buildings that were once temples or palaces, and for the long lines of massive walls that constituted its defences. Even the name has died out of men's minds and memories, and the remains that mark its site are known only as the ruins lying near the little village of Hampe.(Hampi)
Its rulers, however, in their day swayed the destinies of an empire far larger than Austria, and the city is declared by a succession of European visitors in the fifteenth and sixteenth centuries to have been marvellous for size and prosperity -- a city with which for richness and magnificence no known western capital could compare. ..."
దీన్నిబట్టి వాళ్ళు ఆనాటి మన విశేషాలకి ఇచ్చేపాటి గౌరవం కూడా మనం ఇవ్వటంలేదని అర్థం అవుతోంది. కొంత మంది తెలిసీతెలియక మతిలేని చెత్తవాగుడు వాగుతారు. 'ఇప్పుడు కూడా ఇవన్నీ ఏంటోయ్?' అని. నాకు బూతులొచ్చేస్తాయ్ అలాంటి మాటలు వింటే.
అలాగే ఇంకో ముఖ్యమైన విషయం; ఆనాడు ఆయన వేసిన పూలబాట ఈరోజు ముళ్ళమయమవుతోంది. "మన" అనే భావనే లేకుండా పోతుంది మనకి. పోనీ సామరస్యం ఐనా ఉందా అంటే అది కూడా లేదాయే! తనకు ఎన్ని సంస్కృతులు తెలిసున్నా, ఎన్ని భాషల పరిజ్ఞానం ఉన్నా.. తెలుగు భాషను, భారతీయ సంస్కృతిని ఎన్నడూ మరవలేదు రాయలు. వాటి అభివృద్దికి ఎంతగానో తాపత్రయపడ్డాడు. ఈనాటి కాలంలో తెలుగు భాష తెగులుతో బాధపడుతోంది. దాన్ని నయం చేయాల్సిన కనీస బాధ్యత మనమీదుంది. కాబట్టి, కనీసం, తెలుగువారందరం తెలుగును ,తెలుగులోనే మాట్లాడుదాం... అంటే, దాన్ని మిగతా భాషలతో, ముఖ్యంగా హిందీ, ఇంగ్లీషు లాంటి వాటితో కలిపి దంచొద్దు.. మాట్లాడేప్పుడు ఒక వాక్యంలో ఒక భాషే ఉండేలా చూస్కోండి చాలు. ఈ మాట మీ బుర్రకెక్కిందని ఆశిస్తూ.. సెలవు.


Comments
ఇప్పుడే మన తెలుగు సినీ రచయిత
ఇప్పుడే మన తెలుగు సినీ రచయిత "త్రివిక్రం శ్రీనివాస్" గారితో "సాక్షి" లో ఒక ముఖాముఖి చదివి వస్తున్నా..అందులో ఆయన్ని తెలుగు సినిమా భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అడిగితే ఆయన సమాధానం ఏంటంటే "తెలుగు లో ఉండాలి..భాష మాత్రమే కాదు...తెలుగుదనం ఉండాలి..." అని....
సరే మన ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే...సరదాగా మరో రెండు ముక్కలు(అంత ఆసక్తి కలిగించేవి కాకపోయినప్పటికీ నాకు గుర్తు ఉన్నవి)...మనం తెలుగు సినిమాల ద్వారా మహానటుడు ఎన్.టి.ఆర్ ను రాయలుగా చూసాము..అలాగే ఆయన తనయుడు "బాలకృష్ణ" ను కూడా రాయలుగా చూశాము(ఆదిత్య 369)....వారి ముఖవర్చస్సు చూసి రాయల వారు అందగాడు అనుకుంటే పొరపాటే...ఆయన మనసు మాత్రమే అందమైనది...దురదృష్టవశాత్తూ ఆయన మొహం నిండా స్ఫోటకం మచ్చలు ఉండేవిట...ఆయన కళాపోషణ గురించి ఎంత చెప్పినా తక్కువే....ఆయన రాజ్యం సుభిక్షంగా ఉండేది...దానికి ఉదాహరణగా ఇలా చెప్పేవారు..."రాయల వారి రాజ్యం లో రత్నాలు,ముత్యాలు రాశులుగా పోసి అమ్మేవారట"...హంపి,విజయనగర కళావైభవం కూడా చెప్పుకోదగ్గదిగా ఉండేది...హంపి లో శిథిలాలైనప్పటికీ ఇంకా ఆ ఆనవాళ్లు,గుర్తులు మనకు కనిపిస్తూనే ఉంటాయి...
ఆయన రాసిన "ఆముక్త మాల్యద" గురిచి మరిచిపోతే ఈ శీర్షిక అసంపూర్ణంగానే మిగిలిపోతుంది...దానికి "విష్ణు చిత్తీయం" అని మరో పేరు...ఇందులో ముఖ్య కథ కొన్ని పాత్రల చుట్టూ తిరిగినప్పటికీ మరెన్నో కథలు ఉన్నాయి...ఇదే కావ్యం లో ఆయన రాజ్యపాలనా వ్యవహారాల గురించి,రాజనీతి గురించి,న్యాయధర్మాల గురించి కూడా ఎంతో విపులంగా చర్చించినట్టు మనం ఆరవ తరగతి లోనో,ఏడవ తరగతి లోనో చదివిన "శ్రీకృష్ణదేవరాయలు" పాఠం లో ఉందని మీకు గుర్తు ఉందా??
మొత్తానికి అదండి కథ....భాష అంటే మనం చెప్పేది అవతలి వారికి అర్థమయ్యే ఒక సాధనం మాత్రమే కాదు...దానికి మరెన్నో బలమైన బంధాలు ఉన్నాయి...కాబట్టి తెలుగును మరువద్దు....
జై హింద్...జై జన్మభూమి...జై చిరంజీవ... ;)
ఇలా రాయల వారి గురించి
ఇలా రాయల వారి గురించి చర్చించే అవకాశాన్ని కల్పించిన మన గోపీకి నా మనఃపూర్వక అభినందనలు....
ముందు సినిమా వాళ్ళు మారితే
ముందు సినిమా వాళ్ళు మారితే తెలుగు సగం బాగుపడినట్టే.. ఆయన అలా అనటం శుభ సూచకమే :P
నేను రాద్దామనుకుంటూనే మర్చిపోయాను, ఆముక్తమాల్యద గురించి. దాని గురించి చెప్పి ఆ లోటు తీర్చినందుకు నాగ్ కి ధన్యవాదాలు.
రాయలవారి గురించి చర్చ చాలా
రాయలవారి గురించి చర్చ చాలా బాగుంది. కన్నడ ,తెలుగు భాషలకు వారధిగా పనిచేసిన ఈ కాలాన్ని మనం కొనసాగించి ఉంటే, తెలుగుకు మహోపకారం జరిగేదేమో. ఇప్పుడు చూడండీ కన్నడ సాహిత్యం 9 ‘జ్ఞానపీఠ’ లతో దేదీప్యమానంగా వెలుగుతుంటే, మన తెలుగు పాఠకులకోసం దేబరిస్తోంది.
బాగా రాసారు. తెలుగు భాషకు
బాగా రాసారు. తెలుగు భాషకు రాయలు చేసిన సేవ మరొక రాజుగానీ, ప్రభుత్వంగానీ చెయ్యలేదనుకుంటాను.
రాబర్ట్ సెవెల్ రాసిన విస్మృత సామ్రాజ్యం పుస్తకాన్ని గ్యుటెన్‌బర్గు సైటు (http://www.gutenberg.org/etext/3310) నుండి దింపుకోవచ్చు.
పోతే, ఎమ్‌బీయెస్ ప్రసాదు పడక్కుర్చీ కబుర్లలో రాయల గురించి రాసారు. రాయల పట్ల అది మరొక దృక్కోణాన్ని చూపిస్తుంది. ఏదో సరదాగా చదూకోడానికి రాసినట్టు ఉంటది గానీ, విషయం నాణ్యమైనదే!
Post new comment