చెలియలి కట్ట

చిన్న మనవి : తెలుగు సాహిత్యానికి ఆనాడు కవిత్రయం చేసిన సేవని తలపించిన విశ్వనాథ సమకాలీన,అంతకు మునుపు వున్న రచయితల,కవుల గురించి రాద్దామని ఉంది. కాని టపాసుల్లాంటి సంగతులుంటే గాని అలాంటి రాతలు రక్తిగట్టవు. కాబట్టి మీకెవరికైనా ఎంతోకంత, ఎన్నోకన్ని విషయాలు తెలుసుంటే, నాకు ఇక్కడ తెలుపగలరు.
ఇహ విషయానికొస్తే, మొన్నీమధ్య విశ్వనాధ వారి చెలియలికట్ట చదివాను. బావుంది అంటే అది చాలా చిన్న మాట, ఇలా ఒక టపా రాసి చెప్పుకోదగ్గ విషయాలు కొన్ని ఉన్నాయి. కథ మొత్తం ముఖ్యంగా నలుగురి మనుష్యుల మధ్య ఉంటుంది. భర్త - సీతారామయ్య, భార్య - రత్నావళి, భర్త తమ్ముడు - రంగడు, గురువు - ముకుందరామయ్య. నేను కథ చెప్తే నా దోరణి ఎంతోకంత కనబడుతుంది. కాబట్టి, మీరు కథ చదివినప్పుడు మీకు ఇక్కడ రాసినట్టు కాక ఇంకెలాగైనా అనిపిస్తే మీరు కంగారుపడి నన్ను కంగారుపెట్టొద్దు!
ముఖ్య గమనిక : ఇక్కడ నేను వాడే 'స్త్రీ స్వేచ్చ' అనే పదం అతి వాదానికి సంబందించింది. 'స్త్రీ స్వేచ్చ' నిజానికి ఆడవారి బాగు కోసం ఉద్దేశింపబడినది. అది కాస్త వక్రిస్తే వచ్చేదే అతి వాదం. ఉదాహరణకి, 'స్త్రీ తన జీవితానికి సంబందించిన విషయాలలో, అది చదువో,వివాహమో,మరొకటో, తనంతట తను నిర్ణయం తీసుకోగలగాలి' అంటుంది స్త్రీ స్వేచ్చ. దాన్ని కొంచెం వక్రించి,'ఏ స్త్రీ యైనా, ఎవడితోబడితే వాడితో, ఏ పెళ్ళీ పీచు లేకుండానే భోగాలు వెలగబెట్టొచ్చు' లాంటివి అనటం నా దృష్టిలో, అతివాదమే.ఇది మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇక భోగాన్నే ఉదాహరణగా ఎంచుకోవడానికి కారణం, ఇప్పుడు చెప్పుకోబోయే కథలో అది సరిగ్గా సరిపోతుంది కాబట్టి. మీకు ఆసక్తి ఉంటే, నందిని అనే కథ ఒకటి వచ్చింది ఆ మధ్య ఎప్పుడో. అందులో, మరీ ఇక్కడి ఉదాహరణలో చెప్పినంత కాకుండా, ఒక అమ్మాయి, 'పెళ్ళి, పెళ్ళి తర్వాతే కాపురం' అనే రెండు ఆంక్షలు/నియమాలని అతిక్రమించి ఒక అమెరికా యువకుడితో తన జీవితమేదో తను జీవిస్తుంది. అది తప్పా, ఒప్పా అని చర్చించుకోవటం అనవసరం. స్త్రీ స్వేచ్చ లో హద్దులు ఎక్కడ గీయాలన్నదానికి మీరొకటంటే నేనొకటంటాను. కాబట్టి అది ఎంచుమించు అనవసర కాలయాపనే. ఆ కథ చదివాక మీకు ఆ పాత్ర మీద బాగా జాలి ఒలికిపోతే ఒప్పే అనిపించవచ్చు. లేదా తప్పనిపించవచ్చు. కాబట్టి, ఓ నా ప్రియమైన చదువరులారా :P నేను చెప్పొచ్చేదేంటంటే, నేను కూడా స్త్రీ వాదినే, కాకపోతే, స్త్రీ పురుషుల మధ్య ఉండే బంధంలో ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు గౌరవంగా మెలగాలన్నంతవరకే నా వాదన. విపరీతాలు(అది మగాడైనా, ఆడదైనా) మన ఒంటికి పడవు.
ఇక అసలు కథ ...
సీతారామయ్య పెద్దగా ఆస్తిపాస్తుల్లేని వ్యవసాయదారుడు. వయసు 40 సం॥ పైమాటే. మొదటి భార్య చనిపోతే రత్నావళిని చేస్కుంటాడు. అప్పటికి ఆమె వయసు దాదాపు 16 సం॥ఇక రంగడి విషయాని కొస్తే ,అన్నాయ్ కి, కాస్త ఆ పాశ్చాత్య గ్రంధాలవీ చదివి, అప్పటికే బుర్ర బాగా 'స్త్రీ స్వేచ్చ'తో నిండి తొణికిసలాడుతుంటుంది, మన చలం గారికి ++ లాగా అన్న మాట(అపార్థం చేస్కోరాదు, నా మటుకు నాకు చలం ఒక దేవుడు, స్త్రీల కోసమే పుట్టి, గిట్టే దాక స్త్రీల కోసమే రచనలు చేసిన మహా రచయిత). వరసలు పక్కకి నెట్టి, రత్నావళి మీద కన్నేస్తాడు రంగడు. మెల్లగా ఈ 'స్త్రీ స్వేచ్చ'ని కొంచెం ఆమెకి కూడా అంటిస్తాడు. ఇంకేం? 'మొగుడు లేడు, పెళ్ళాం లేదు. ఒదినా లేదు, మరిదీ లేడు - అంతా మనిషి పెట్టుకున్న ఆంక్షలు' లాంటి పిడివాదం ఒకటి పట్టుకుని, ఇద్దరూ చెట్టాపట్టాలేస్కుని మద్రాసు లేచిపోతారు. పాపం అప్పటికి రత్నావళికి చదువు లేదు. రంగడికి అదున్నా దానివల్ల పెద్ద ఒరిగిందీ లేదు, వాడికి క్షణికావేశంలో అక్కరకొచ్చిన ఒక మహోపన్యాసం ఈ 'స్త్రీ స్వేచ్చ'. అది తెలుసుకోలేకపోయాడు. ఆ మద్రాసులో రత్నావళి రకరకాల మనుషుల గురించి తెలుసుకుంటుంది. రంగడి స్నేహితుల వల్ల కొన్ని చేదు, తీపి అనుభవాలు ఎదురవుతాయి. ఇద్దరూ కొన్నాళ్ళు కాపురం వెలగబెట్టాక, ముకుందరావనే ఒకతను, రంగడి స్నేహితుడు, వస్తాడు. అప్పటికే రత్నావళికి చదివుకోవాలనే తపన గుబురుగా పూలు పూచి, కాయలు కాసేస్తుంది. ముకుందరావు కొంతకాలానికి ఆమెను తనంత పండితురాల్ని చేస్తాడు. ఈ క్రమంలో ఆమె మళ్ళీ ఆ అతి స్వేచ్చ నుంచి మామూలు ప్రపంచంలో కి వస్తుంది. కొన్ని సంఘటనల కారణంగా రంగడు కూడా తను చేసిన పనికి పశ్చాత్తాప్పడతాడు. మరోవైపు, సీతారామయ్య మూడో భార్యకి కొడుకు పుడతాడు. చివరికి రత్నావళి తన భర్త కొడుక్కి తను అధ్యాపకురాలిగా సంపాదించిన డబ్బంతా రాసేస్తుంది. రంగడు మద్రాసులో ఉన్న ఇంటి సామాను, తను కూడ బెట్టిన డబ్బు తన మేనల్లుడుకి రాసేస్తాడు. ఇద్దరూ వాళ్ళు ఊరి సముద్రానికొచ్చిన ప్రళయంలో ప్రాణాలొదులుతారు.
చాలా చాలా వదిలేశాను. మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఇంతిలా ఈ కథని ఎవ్వడూ కూనీ చేయడు. అసలు ఏ నవలలోనైనా కథకంటే ఆ కథలో పావుల్ని కదిపే తీరు మనమీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, అది చదివేవాళ్ళకు తెలుస్తుంది, కాబట్టి నవలలో పట్టు కథ మాత్రమే కాదు. ఆ పాత్రల సృష్టి, వాటి మధ్య జరిగే వాగ్వివాదాలు, ఉండే రాగద్వేషాలు, ఇలాంటివన్నీ మనం ఆ కథ చదివే తీరుని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ అవన్నీ రాయలేక వదిలేశాను. నాకు ఈ కథలో బాగా నచ్చిన పాత్ర రత్నావళిది. మొదట్నుంచి చివరిదాక ఆ పాత్రని నడిపించిన తీరు అధ్బుతం. కథ మధ్య మధ్య లో ఒక యోగి, చెలియలి కట్ట గురించి పాడుతుండడం, రచయిత చెప్పాలనుకున్నదానికి చాలా ఊతంగా సహాయపడింది. హా, అన్నట్టు చెలియలి కట్ట అంటే, సముద్రపు గట్టు/తీరం. సముద్రం ఆ తీరం దాటితే ప్రళయమే అనే ఉద్దేశ్యంతో వాడారు ఆ పదాన్ని. అలాగే మనం ఏర్పరుచుకున్న కొన్ని బంధాల్ని, వరుసల్ని, సంప్రదాయాల్ని, ధర్మాల్ని గౌరవించనపుడు అది పతనానికి నాంది అని రచయిత ఉద్దేశ్యం. ఆలాగని అహేతుక ఆచారాలన్నీ పాటించాలని ఆయన అనరు. సమాజంలో కల్లోలం లేకుండా ఒక కాపు కాస్తున్న ధర్మాల్ని నేలరాయొద్దంటారు.
కాని, సీతారామయ్య పెళ్ళి విషయంలో రచయిత దోరణి నాకు అంతుబట్టకుండా ఉంది. అటు ప్రోత్సాహకంగానూ లేదు, ఇటు ఎండగట్టనూ లేదు. ఆ వయోభేదం కూడా రత్నావళి రంగడి వెంట లేచి వచ్చేయడానికి కారణమైందంటారు ఒకచోట. ఇంకో చోట, వివాహధర్మం వదిలి అలా వెళ్ళిపోవటం తప్పంటారు. అసలు ఆ ముసలాయనికి మూడో పెళ్ళి ఎంత వరకు న్యాయం? అది కూడా చిన్న పిల్లతో! అర్థమైనట్టే ఉంటుందిగాని, ఎక్కడో చిన్న వెలితి. చలం గారి మైదానం చదవకపోవడమే ఈ వెలితికి కారణం అనిపిస్తుంది. చాలా మంది రాశారు: మైదానం, చెలియలి కట్ట - చలం, విశ్వనాధ పరస్పర వాదనలని. అదీ చూద్దాం!

Comments
నేను మైదానం చదవలేదు కానీ దాని
నేను మైదానం చదవలేదు కానీ దాని gist english లొ ఒకాయన రాస్తే చదివాను ఒక website లో....మైదానం నువ్వు చెప్పిన అతివాద సూత్రాలని పాటిస్తున్నట్టుంటుంది...ఆయనెవరో gist రాశారు..చాలా బాగా రాశారు...
కాని నవల చదివితే గాని అసలైన పాత్రల మనో సంఘర్షణ ఏంటో తెలిసి రాదేమో...చలం గారి వాదన వినరాదేమో....మనం "చెలియలికట్ట" లో ముసలాయన పడుచు పిల్లల్ని రెండో,మూడో పెళ్లిళ్లాడడం ఎలా అసంపూర్ణంగా,అసంబద్ధంగా అనుకుంటామో అలాగే చలం మైదానం లో కూడా కొంత అసంబద్ధత ఉందనేది ఆ article రాసినాయన వాదన..
చలం గారి స్త్రీ స్వేచ్ఛా వాదంలో ఎక్కువ భాగం వారి లైంగిక స్వేచ్ఛకే కేటాయించారనేది ఒక పెద్ద విమర్శ...అంటే నాకు తెలిసి మన సంస్కృతి ప్రకారం మిగతా అన్ని వర్గాల్లోనూ స్త్రీ స్వేచ్ఛ సాధ్యమేమో కాని,ఈ లైంగిక స్వేచ్ఛ అనేది మనల్ని ఎప్పటికీ గుచ్చుతూనే ఉండే ఒక ముల్లు..చలం గారు తన radical ideologyతో దీన్ని పెంపొందింప చూశాడు...అదే వాదాన్ని తన మైదానం లో చొప్పించాడు...కాని అది నాకైతే రుచించలేదనే చెప్పాలి...
మొట్టమొదటగా చలం పాశ్చాత్య విద్య,సంస్కృతుల విపరీత ప్రభావానికి లోనయ్యాడనేది నిజం...రెండవది మన సంస్కృతి,అందులోని లోతుపాతుల గురించి మనకెవ్వరికీ సరైన అవగాహన లేక,దాన్ని మనం సరిగ్గా ఆచరించక,ఎక్కడ పడితే అక్కడ ఏర్పడ్డ misconceptions వలన ఇబ్బందులు పడుతున్నాం...దాని వలనే మన సంస్కృతి లో పుట్టిన మూఢాచారాలు చాలా cruel and barbarousగా ఉంటాయి...ఇవన్నీ జనుల తప్పుడు interpretations వల్లే గాని మరొకటి కాదనేది నా వాదన..
మన సంస్కృతి గురించి అంతో ఇంతో బాగా తెలుసుకున్న వ్యక్తుల్లో విశ్వనాథ ఒకరు...ఆయన రచనల్లోనూ తప్పొప్పులు లేకుండా ఉండవనేది జగమెరిగిన సత్యం...ఆయన "వేయి పడగలు" చూస్తే ఒకేసారి మన సంస్కృతి పై ఆయనకున్న అవగాహన మరియు కొన్ని అసంబద్ధ వాదనలూ కనిపిస్తాయి...కాబట్టి చలం కరక్టా,విశ్వనాథ కరక్టా అనేది కాదు సమస్య...ఇద్దరి వాదనల్లోని నిజనిజాలు నిగ్గు తేల్చి(ఏ మాత్రం preconceptions లేకుండా) వాటిని మన మనసులో భద్రపరచుకోవలసిన బాధ్యత మనదే...
చాలా బాగా రాశావు మామ. రచయిత
చాలా బాగా రాశావు మామ. రచయిత తన వైపు నుంచి చెప్పినా, అది మన సమాజపరిస్థితులకి అన్వయించుకుని సరిగా అర్థం చేస్కోవడం మన బాధ్యతే. విశ్వనాథ మైదానానికి ఒక నవల రాశి స్పందిచాల్సి వచ్చిందంటే చలం దాన్ని ఏ స్థాయిలో రాశారో అర్థం చేస్కోగలను... ఆ స్థాయి తెలుసుకుందామనే చదువుదామనుకుంటున్నా. :)
అయితే ఇంకో విషయం మామా.. చలం
అయితే ఇంకో విషయం మామా.. చలం అలా రాయటానికి కొన్ని కారణాలు లేకపోలేదు. రామకృష్ణ గారు class లో ఒక కథ చెప్పారు గుర్తుందా? 'ఆడ మళయాళం' అని. చలం గురించి చదివేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. మగాడు చేసే తప్పు ఆడది చేస్తే వాడ్ని ఏమి పట్టించుకోని సమాజం ఆమెని మాత్రం వదలకుండా తప్పుపట్టటం సహించలేక ఆయన ఆ విధమైన దోరణి కనబరిచారని నా ఉద్దేశ్యం.
సహజంగా మగవాడు
సహజంగా మగవాడు శారీరకంగా,మానసికంగా(అన్ని సార్లు కాకపోవచ్చు) ఆడవారి కంటే బలవంతుడు కావటం వల్ల ప్రపంచం మొత్తం పురుషాధిక్య సమాజం ఉంది...అది మన దేశానికే పరిమితం కాదు...తప్పు ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు...మన పురాణాల్లో రాజులకు,దేవతలకు బహుభార్యత్వం ఉండటం వెనక కొంత అంతరార్థం ఉంది..దాన్ని గ్రహించక మనకు కృష్ణుడంటే పదహారు వేల మంది భార్యలు కలవాడుగా(ఒక ప్లేబాయ్ సింబల్ గా) చూపిస్తారు...కాని అందులో చాలా తాత్త్వికార్థం ఉంది...కృష్ణుడికి అసలు ఉన్నది 8 మంది భార్యలే...
అందులో రుక్మిణి కి లొంగి ఉండేవాడు కృష్ణుడు..(మనం అనుకున్నట్టు సత్యభామ కి లొంగి ఉండటం కేవలం పైపైకి మాత్రమే)....ఇందులో ఇంకా తాత్త్వికార్థం ఉంది..అది గ్రహించక మనం కృష్ణుడిని "అలా" ఆదర్శంగా తీసుకుంటాం...
"మగవాడు విచ్చలవిడిగా తిరగటం మన సమాజం ఎప్పుడూ ప్రోత్సహించలేదు...కాకపోతే మగవాడి బలం వలన అది చెల్లింది..అంతే...అదే తప్పు ఆడవాళ్లెందుకు చెయ్యకూడదు అనటంలో అర్థం లేదు...స్వేచ్ఛ కి ఒక హద్దు ఉన్నప్పుడే దానికి అర్థం ఉంటుంది...ఆడవారికి అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించమనటం సబబు...అంతే కానీ మగవాడితో సమానంగా తప్పులు చేసే హక్కు కూడా కల్పించమనటం అపహాస్యమవుతుంది...తప్పు కి లింగ భేదం ఉండదు...ఎవరు చేసినా అది తప్పే....
చలం గారు ఈ సమాజం పోకడలతో విసిగిపోయి అలా రాశారు అనుకోవచ్చు...అంతే కానీ స్త్రీ లేదా పురుషుడు అలా విచ్చలవిడిగా తిరగొచ్చనేది ఆయన ఉద్దేశ్యం అయితే నేను దానితో ఏకీభవించలేను...
ఎంత పని చేశావ్ మామా! :P
ఎంత పని చేశావ్ మామా! :P నేననేదీ అదే.. అలా ఆడామాగ కి వ్యత్యాసం పెరిగిపోవడం వల్లే అలాంటి చలం పుట్టాడని నా వాదన, అంతేకాని ఆడవాళ్ళు కూడా అవే తప్పులు చేయడానికి సమాన హక్కులు కల్పించే ఉద్యమకారుడు కాడనుకుంటాను. నేను చలం గురించి చదివానే తప్ప, ఆయన రచనలు ఇంకా పెద్దగా చదవలేదు. కాబట్టి ఇప్పుడే ఆయన మీద ఒక అభిప్రాయానికి రాలేను...
nEnu nuvvu cheppinadaanitO
nEnu nuvvu cheppinadaanitO sambandham lEkunDaa ee comments dwaaraa naa general opinion cheppaanulE...i mean evarO okaru chaduvutaaru kadaa!!!vaariki naa message andutundanE aaSa...antE tappa nee vaadana adi kaadani kaadu naa comment ki artham...
Post new comment