గోదావరి

ఈ రెండు రోజులు ఇంటికెళ్ళడం, పనుండి అలా రాజమండ్రి వెళ్ళడం జరిగింది. గోదావరి ఉద్దృతి తగ్గి, ప్రశాంతంగా ప్రవహిస్తోంది. చా...ల అందంగా ఉంది. బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నబస్సు మెట్ల మీద నిలబడి తనివితీరా ఆశ్వాదిస్తున్నా. అప్పుడు నాలో నేననుకున్న నాలుగు వాక్యాలివి.
సద్దులేని పదాలతో, నిలువెల్లా పులకింతై,
అడుగడుగున తుళ్ళుతూ, కను లెల్లల కలియజూస్తు,
యౌవ్వన హోరులు నీలో, సలుపును పలుచన చేయగ,
కనువిందులు చేసావే, హృదయపు ఎల్లలు తాకావే.

కన్నెపిల్ల పంటిపట్టున, ఎక్కుపెట్టిన పెదవినారిన,
వదిలిన ప్రాయపు శరముల తీరున, ఆ అలల పయనాన..
జింకపిల్ల నిన్నుజూడ అభిమానం అడ్డుగాద?
లేగదూడ గమనిస్తే లోలోపల చిన్నబోద?

హరరే!
నిన్నుదాచె తిన్నెలన్ని కరిగిపోయె నీ ఒడిలో,
ఓ దేవేరీ, గోదావరి! తడిచిపోవ వెన్నెటిలో?
త్వరత్వరగా అటు పదమరి, తల్లి కడలిలోకి,
నాలాటి పిలగాండ్ల శ్వాస నిలుపడానికి.
వివరణ : సద్దులేని పదాలంటే, చప్పుడులేని అడుగులు. కను లెల్లల కలియజూస్తు అంటే కనులు ఎల్లలకేసి చూస్తూ అని, ఎల్లలు అంటే తీరాలు. సలుపు అంటే, శ్రమ లేదా గాయం వల్ల కలిగే నొప్పి లాంటిది. చివరి రెండు వాక్యాలు కొంచెం కొత్తగా స్ఫురించవచ్చు. కారణం సముద్రుడ్ని ఇప్పటిదాక నదులన్నిటికీ మొగుడన్నట్టు చూపించడం. కాని నాకు అలా అనిపించలేదు. 'గోదావరి, ప్రాయంలో ఉన్న ఒక అందమైన అమ్మాయిలా అనిపించడం, ఆమె అలా కనిపిస్తూ ఉంటే  కుర్రాళ్ళు ఊపిరి కూడా తీస్కోవటం మర్చిపోయి  చూడటం, చివరికి వెటకారంగా 'వెళ్ళు తల్లీ.. వెళ్ళు.' అని ఆమెను వాళ్ళమ్మ వద్దకు పొమ్మని, దీర్ఘంగా వాళ్ళకు వాళ్ళు నిట్టూర్చుకోవడం'. ఇలా అనిపించింది. ఇక్కడ సముద్రాన్ని, కడలిగా సంభోదించి గోదావరికి అమ్మగా అనుకున్నానన్నమాట. మొగుడైతే అదో పెద్ద సమస్య మళ్ళీ!