పరిహాసకులకి సమాధానం
భాష భాషో అంటూ ఎందుకలా ఛస్తావ్ అని నన్ను అడిగిన ప్రతివాడికి తనివితీరా ఒక సమాధానం చెప్పాలనిపిస్తుంది. కొందరికి నా తీరులో చెప్తే అర్థం చేస్కుంటారు. కానీ కొందరలా కాదు, నా ఉద్దేశ్యాలన్నీ సరైన మాటల్లో పెట్టలేకపోవడం నా అసమర్థతో, చెప్పినదాని గురించి సావధానంగా ఆలోచించలేకపోవడం వారి బడాయో తెలీదు. కానీ తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు వారి బ్లాగులో ఒకతనికి సమాదానమిస్తూ ఇలా వ్రాశారు.. ఆయన అనుమతితో ఇక్కడ కూడా అదే సమాధానం అచ్చు వేస్తున్నాను.
కానీ దానికి ముందు ఒక మాట, నా స్నేహితుల్లో గిరీష్ అని ఒకతను, నాతో ఒకప్పుడు ఒక మాటన్నాడు, "బూతులు తిట్టడానికి జర్మన్, అమ్మాయికి ప్రేమ తెలియజేయడానికి ఫ్రెంచ్, బిజినెస్ లావాదేవీలకి ఇంగ్లీష్ చాలా అనువైన భాషలంటరా" అని. అప్పుడేదో సమాధానం చెప్పినా వాడు తృప్తిపడ్డాడని అనుకోను. ఇలాంటి (ఒక రకంగా) మూఢ విశ్వాసాలే ఎవరికన్నా ఉండి ఉంటే, ఇదిగో ఈ సమాధానం ఐతే సరిగ్గా సరిపోతుంది.
"ప్రవీణ్ శర్మగారూ ! మీరు ఇంగ్లీషు మీడియమ్ లో చదివినవారు. మీకు ఏదైనా ఇంగ్లీషులో చెబితేనే అర్థమైనట్లు ఉంటుంది. అలా అయితేనే మీ చెవులకి హుందాగా, గౌరవనీయంగా అనిపిస్తుంది. అది మీరు అలవాటైన పద్ధతి. అది అందఱికీ వర్తించదు. ముఖ్యంగా నాలాగా తెలుగుమాధ్యమంలో చదివినవారికి. ఇప్పుడు ఇంగ్లీషులో ఉన్న సాంకేతికపదాలు కూడా మొదట్లో వాడినప్పుడు ఎవరికీ అర్థం కాని పదాలే. పీసీలు జనం చేతిలోకి రాకముందు ఒక పాతికేళ్ళ క్రితం హార్డ్ డిస్క్ అనేది సాధారణ ఇంగ్లీషువాళ్ళక్కూడా హాస్యాస్పదమైన పదమే. నేను కోరుతున్నదల్లా "తెలుగు అనువాదాలన్నీ హాస్యాస్పదమైనవే" అనే ఈ మూఢవిశ్వాసం నుంచి బయటపడమని, తెలుగుపదాల్ని కూడా ఇంగ్లీషులాగానే ప్రేమించమని, వాడుతున్నకొద్దీ మీకు నవ్వు రావడం మానేసి గౌరవభావం కలగడం మొదలవుతుంది. సృష్టిస్తున్నకొద్దీ వాడుతున్న కొద్దీ తెలుగు పదాల క్రమబద్ధతనీ, నిర్మాణాన్నీ మీరు ఆస్వాదించడం మొదలుపెడతారు. తెలుగులోకూడా గౌరవనీయమైన శబ్దజాలం చాల ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. భాష యొక్క స్వభావాన్ని స్వాతంత్ర్యాన్ని నిలబెట్టాలి. మన భావదారిద్ర్యానికి, మాతృభాషాపరమైన అజ్ఞానానికీ ఇంగ్లీషుపదాలతో అతుకేసుకున్నంత మాత్రాన మనం గౌరవం పొందుతామనుకోవడం ఒక భ్రమ. స్వకీయత (ఒరిజినాలిటీ) ద్వారానే ఏ జాతైనా గౌరవాన్ని పొందుతుంది. ఇంగ్లీషు పదాలు ఇంగ్లీషువాళ్ళ స్వకీయతకి నిదర్శనం. మఱి ఒక స్వతంత్ర జాతిగా మన స్వకీయత సంగతేంటి ? భావాలతో పాటు పదాల్ని కూడా అనుకరించి తీఱాల్సిందేనా ? మీరు అలా అనుకొని ప్రత్యామ్నాయ తెలుగు పదాల్ని సృష్టించకుండా కేవలం ఇంగ్లీషు పదాల్తో లాగిద్దామనుకుంటే కొన్ని పంక్తులు రాసేసరికి "దీని బదులు నేరుగా ఇంగ్లీషులోనే రాయడం నయంరా బాబూ" అనిపిస్తుంది. ఇక తెలుగెందుకు ? "తెలుగు పదాలు అవసరం లేదు" అనే వాదన ఇంకా ముందుకెళ్ళి "అసలే తెలుగే అవసరం లే"దనే వాదనకి దారితీస్తుంది. ఇప్పుడు జఱుగుతున్నది అదే.
ఈత అన్నాక నీళ్ళలోకి దూకి నేర్చుకోవలసిందే. భాష అభివృద్ధి చెందాకనే అందులో సాంకేతికాంశాలు రాస్తానంటే కుదఱదు. ముందు రాస్తూరాస్తూ ఆ క్రమంలో కొత్తపదాల్ని కనిపెడుతూ వాడుకలోకి తెస్తూ ఉంటేనే భాష అభివృద్ధి చెందుతుంది. సాహిత్యభాష కాస్తా సాంకేతిక భాషగా పరిణామం చెందుతుంది. ఇంగ్లీషు కూడా ఇందుకు మినహాయింపు కాదు. "

Comments
చాలా మంచి వివరణ.
చాలా మంచి వివరణ.
ప్రశంశించడం సులభమే కానీ ఆచరణ
ప్రశంశించడం సులభమే కానీ ఆచరణ (practice) కష్టం.
బాగా చెప్పేరండీ. నా అభిప్రాయం
బాగా చెప్పేరండీ. నా అభిప్రాయం కూడా అదే. తెలుగులో రాయడానికి ఇంగ్లీషు రావాలన్నవాదన మనకి బ్రిటిష్ వారికాలంలో వచ్చింది. ప్రముఖరచయితలు కూడా ఇంగ్లీషులో మాటాడితేనే గొప్ప అని గొప్పలు పోవడం అప్పుడే మొదలయింది. దేశానికి స్వరాజ్యం తెచ్చుకున్నాం కానీ భావదాస్యం పోలేదు.
మీరు కూడా ఇంగ్లిష్
మీరు కూడా ఇంగ్లిష్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి చూడండి. అప్పుడు తెలుస్తుంది కొన్ని పదాలని అనువదించకుండా యథాతథంగా ఇంగ్లిష్ లో వ్రాయడం మంచిది అని.
ఇట్లు ప్రవీణ్
http://hegelian.mlmedia.net.in/
మీరన్నది అర్థం చేస్కోగలను.
మీరన్నది అర్థం చేస్కోగలను. కానీ, శతాబ్దాలుగా ఎన్నో పదాలు కలుస్తూ మరెన్నో పదాలు ఆవిరవుతూ వస్తున్న సముద్రంలాంటిదీ భాష. కొన్ని సార్లు కావల్సిన పదజాలం దొరకక నిరుత్సాహం రావడం నిజమే. టెక్‌సేతు లో నాకు కూడా అనుభవమే. దానికి కొందరి ఔత్సాహికుల బలం, పండితుల అండా తీసుకోవాలి, తప్పదు. అంతేకాని, ఇంగ్లీషు పదాలు వాడేయ్యటమే నయమని చేతులెత్తెయ్యడం మంచి పద్దతి కాదని నా అభిప్రాయం.
ఇంగ్లిష్ పదాలు వాడకపోతే బాష
ఇంగ్లిష్ పదాలు వాడకపోతే బాష పాషాణ పాకం (stone sweet) లాగ ఉంటుంది.
ఇంగ్లీషులో కూడా అలాంటి
ఇంగ్లీషులో కూడా అలాంటి పాషాణాల్లాంటి పదాలున్నాయి. కాని వాటి స్థానే సరళంగా ఉండే పదాలు వాడుతున్నాం కనుక అలాంటి ఆ పాషాణపాకాలు ఇంకా కానరాలేదు. తెలుగులో నోరు తిరగని పదాలూ ఉన్నాయి, హాయిగా జాలువారే సరళమైనవి ఉన్నాయి, తెలియపోతే తెలుసుకోవాలి, పదాలే లేకపోతే సృష్టించాలి. ఖచ్చితంగా ఇంగ్లీషు వాడవల్సిందే అని మీరెందుకంటున్నారో అర్థంకాలేదు. ఇంగ్లీషు పదాలు లేకుండా భూమ్మీద ఏ భాష లేదనా మీ ఉద్దేశ్యం? వాళ్ళిలా అనుకోవట్లేదే.
ఇంగ్లిష్ లో బహుళార్థాలు ఉన్న
ఇంగ్లిష్ లో బహుళార్థాలు ఉన్న పదాలు ఉన్నాయని తెలియని వాళ్ళు ఉన్నారు. Negation అనే పదం విషయంలో ఒక తెలుగు పండితుడు గారు కంఫ్యూజ్ అయిపోయారు. రెండు బాషలూ సరిగా రాకపోతే అది ఎవరి తప్పు? రెండు బాషలూ సరిగా రాకపోతే ఇంగ్లిష్ కూడా పాషాణ పాకం అవుతుంది.
మన అదృష్టమో, మన తాతల
మన అదృష్టమో, మన తాతల అసమర్థతో, తెలుగు భాషని సాంకేతికంగా బలపరచవల్సిన బాధ్యత మనమీదుంది. అలా జరగని పక్షంలో తెలుగు భాష ఇంకొన్ని తరాలకు మించి మన్నదు. అందులో ఉన్న ఇక్కట్లు మీలా ప్రయత్నపూర్వకంగా తెలుసుకుని ఆ సమస్యలను నలుగురిలోకి తెచ్చేవారు ఈ మధ్యే కాస్త కనబడుతున్నారు(లేదా నేను ఇప్పుడే నిద్ర లేచానో). అలాంటి మీరు కూడా నిరుత్సాహ పడిపోవడం ఒకింత బాధనిపిస్తుంది. ఈ సమస్యకి కాస్త ఓర్పు, సమయం అవసరం. ఓర్పు కోల్పోకుండా ఆ సమయం కోసం ప్రయత్నిస్తూ ఎదురుచూడటమే...
తెలుగులో మాత్రం standard
తెలుగులో మాత్రం standard తెలుగు ఉందా? Stoneని శ్రీకాకుళం బాషలో రాయి అంటే కరీంనగర్ బాషలో బండ అంటారు. Holeని శ్రీకాకుళం బాషలో కన్నం అంటే కరీంనగర్ బాషలో రంధ్రం అంటారు. Boneని శ్రీకాకుళం బాషలో దుమ్ము అంటే కరీంనగర్ బాషలో బొక్క అంటారు. తెలుగు బాషలోనే standardisation లేనప్పుడు తెలుగులో ఏ బాష పదాలు కలిపితేనేం?
నేను భాషాపండితుడిని
నేను భాషాపండితుడిని కాకపోవచ్చు కాని, మీరు చెప్పిన ఉదాహరణ, భాషకు పామాణీకరణ(Standardization) లేదనడానికి అస్సలు సరిపోదు. మీరు చెప్పినవి యాసలు(diaelects) అంటారు. అలాంటివి తెలుగులోనే కాదు, ఇంగ్లీషులో కూడా కోకొల్లలు. తెలుగు భాషకు ప్రామాణీకరణ లేకపోవడం ఏంటండి? మీరు ఏ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్నో ఆశ్రయిస్తే నయం, మీకు కావల్సిన సమాచారం, పాండిత్య సహాయం అక్కడ దొరకవచ్చు.
గోపాల్ గారు చాల బాగా
గోపాల్ గారు చాల బాగా చెప్పారండి. తెనుగు బాషకు ప్రమాణికరణ లేదనడం సహించలేనిది. అయిన ప్రమాణికరణకు యాసకు తేడా తెలియకపోవడం విచారకరం...
ప్రత్యామ్నాయం లేనప్పుడు
ప్రత్యామ్నాయం లేనప్పుడు పరభాషాపదాలు వాడొద్దని ఎవరూ అనడంలేదు. సృజించడానికి తెలుగులో అవకాశమున్నప్పుడు కూడా బస్తాల కొద్దీ విదేశీపదాల్ని దిగుమతి చెయ్యడాన్నే ప్రశ్నిస్తున్నాం. భాషాప్రయోజనం, వాడుక - వీటన్నింటికంటే ముఖ్యమైనది భాషాభిమానం. అదంటూ అసలుంటే వాడుక మొదలైనవన్నీ చిన్న విషయాల్లా కనిపిస్తాయి. ఆ అభిమానమే లోఫించాక ప్రతి చిన్నవిషయమూ ఒక పెద్ద సమస్యై కూర్చుంటుంది. భాషాచర్చల స్థానంలో అహంకార ప్రదర్శనలు బయల్దేఱతాయి.
ఇది వాడాలి, అది వాడకూడదు అని కాదు భాషాభిమానులు చెబుతున్నది. ఈ భాషాజాతిలో జన్మించినందుకు ఈ భాష మీద అభిమానాన్ని పెంచుకోమని చెబుతున్నారంతే. అది మనిషి యొక్క కనీసధర్మం. కర్తవ్యం కూడా !
తెలుగులో ఉన్న పదవైవిధ్యం దాన్ని ఇతరభాషా పదాలతో నింపెయ్యొచ్చు నన్నదానికి సమర్థకం గానీ లైసెన్సు గానీ కాదు. ఒక భాషలో ఉన్న వైవిద్యం ఆ భాషాప్రజల వైవిధ్యభరిత ఆలోచనావైఖరి (variety thinking) కి నిదర్శనం. భాష ఎంత ఎక్కువ భౌగోళిక విస్తీర్ణంలో మాట్లాడబడితే అంత వైవిధ్యభరితంగా ఉంటుంది దానిలోని పదజాలం. తద్విరుద్ధంగా ప్రతిపదాన్నీ అరువు తెచ్చుకోవడం సృజనాత్మక శక్తిలోపానికి తార్కాణం. అది కనీసం మూడు విషయాల్ని సూచిస్తుంది.
౧. ఆ వ్యక్తుల్లో సృజనాత్మకత లేదని, ఒరిజినల్ గా ఆలోచించడం సంగతలా ఉంచి వారు కనీసం అనువాదాలు కూడా చెయ్యజాలరని !
౨. వారికి తమ భాషలోనే పట్టులేదని ! తమ మాతృభాషా పదాల నిర్మాణాల్ని వారు అర్థం చేసుకోలేక పోతున్నారని, వాటి ననుసరించి కొత్త పదనిర్మాణాలు చెయ్యడానికి అవసరమైన శిక్షణ వారిలో లోపించిందని !
౩. అలాంటివారి చేతుల్లో ఉండడం వల్ల ఆ భాష ఎదగడంలేదని !
ఏ ఆహారం దొరకకపోతే కుక్క మాంసం
ఏ ఆహారం దొరకకపోతే కుక్క మాంసం భుజించిన విశ్వామిత్రుడి కథ చదివారా? దొరికినా తినలేని ఆహారాలు లాంటివి కూడా ఉంటాయి. రైల్వే స్టేషన్ ని పొగ బండ్లు ఆగే స్థలం అనాలి అని చెపితే ఎంత మంది జనం పాజిటివ్ గా తీసుకుంటారు?
ఏ భాషకైనా standardisation
ఏ భాషకైనా standardisation ఉంటుందండీ. మీరు చెప్పిన ఉదాహరణలన్నీ వ్యావహారికంలో ఒక పదాన్ని ఉఛ్ఛరించటంలో వచ్చిన మార్పులు, లేదా ఆ పదానికి గల నానార్ధాలు.ఒక భాషని వ్యావహారికంలో వాడుతున్నపుడు ఆ భాషలోని పదాలు రూపాంతరం చెందుతుంటాయి.ఏ భాషలో ఏ భాషని కలిపితే మాత్రం తప్పేముందండీ?కానీ అలాంటి ప్రయోగాలకి మనలాంటి తెలుగువాళ్ళం ముందే తయారైపోతూ వుంటాము.మనకి తోచదు, పక్కవాళ్ళని చూసైనా నేర్చుకోము.
చాలా భావాల వ్యక్తీకరణకి
చాలా భావాల వ్యక్తీకరణకి ఇంగ్లీషులో చేస్తున్న వాడుకలు ఇంగ్లీషు కానేకావు. అవి లాటిన్, గ్రీకు పదప్రత్యయ నిర్మాణాలు. అది వాళ్ళకి చేతనైనప్పుడు మన తెలుగు-సంస్కృత పదప్రత్యయ నిర్మాణాలతో స్వకీయత (originality) కలిగిన దేశీయ ప్రత్యామ్నాయాల్ని రూపొందించడం మనకెందుకు చేతకాదని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. మన భాషలు అంత పదదారిద్ర్యంతో అలమటిస్తున్నవి కావు. ఆ పదాల్ని నేర్పేవాళ్లు, నేర్చుకునేవాళ్లు లేక అఘోరిస్తున్నవి మాత్రమే. మన భాషలకి ఇంగ్లీషు కంటే ప్రాచీనచరిత్ర ఉంది. ఇంగ్లీషుకంటే ప్రాచీనమైన సాహిత్యమూ ఉంది. పదాలు ఒక జాతియొక్క మేధోచరిత్రని సూచిస్తాయి. పరాయి పదాల్ని భారీగా వాడ్డమంటే ఒక జాతిగా మనకి బుద్ధి లేదని, స్వకీయత (originality) శూన్యమనీ ఒప్పుకోవడమే అవుతుంది. తాత్కాలికంగా పని జఱగడం కంటే నా దృష్టిలో ఒక భాషాజాతిగా మన అస్తిత్వమూ, మన సంప్రదాయమూ, మన ప్రతిష్ఠ శాశ్వత ప్రాతిపదికన నిలబడ్డం ముఖ్యం. ఆ దృష్టి లేనివారూ, రోజువారీ మనుగడ గుఱించి, "జఱగడాల" గుఱించి మాత్రమే ఆలోచించే స్థాయిలో ఉన్నవారూ మేధావులు (intellectuals) కాజాలరు. అలాంటివారి చేతిలో భాష భవిష్యత్తు అంధకార బంధురం.
పదాల్ని ఏ పదానికా పదం
పదాల్ని ఏ పదానికా పదం వేఱువేఱుగా దిగుమతి చేసుకోదగ్గ ఐకాంతిక స్వమూర్తులు (stand-alone entities) గా చూడ్డం పొఱపాటు. నిజంగా అవి ఐకాంతిక స్వమూర్తులే అయితే నిరభ్యంతరంగా కావాల్సినన్ని విదేశీ పదాల్ని దిగుమతి చేసుకోవచ్చు. కానీ ప్రతి పదానికీ ఒక ధాతువు (మూలపదం), ఒక ఉపసర్గ, ప్రత్యయం, దాన్నుంచి నిష్పన్న పదాలూ మొదలైన విస్తారమైన "పదకుటుంబం" ఒకటుంటుంది. దాన్ని తరతరాల వ్యాకరణ సంప్రదాయల ఆధారంగా నిర్మిస్తారు. విదేశీ పదనిర్మాణాలు వారి వ్యాకరణ సంప్రదాయాల ననుసరించి ఉంటాయి. వారికి అవి తెలుసు కనుక అంతకుముందునుంచి తమ భాషలో ఉన్న పదాల నుంచి సరికొత్తపదాలూ (derivatives), ఆ కొత్తపదాల నుంచి ఇంకా కొత్తపదాలూ - అలా అనంతంగా పదకల్పన చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అంటే వాళ్ళు తమ భాషలో Further coinage కూడా చెయ్యగలరు. అది వాళ్ళ భాష కనుక. ఇంగ్లీషులో ఉన్న పదాలు అచ్చమైన ఇంగ్లీషుపదాలే అయితే మనం ఇంగ్లీషు ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు అలా లేదు. అ భాషలో 70 శాతం లాటిన్ గ్రీకు పదాలు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక భావనలకి సంబంధించి 90 శాతం అవే.
మనం ఇంగ్లీషులోని సాంకేతిక పదాల్ని దిగుమతి చేసుకోగలమే తప్ప ఆ పదాల్ని వారిలా మార్చి (modify చేసి)Further coinage చెయ్యగలమా ? అని ఆలోచించాలి. మనం చెయ్యలేమనేది సుస్పష్టం. మనలో అత్యంత మేధావులూ, విద్యావంతులూ అయినవారు కూడా చెయ్యజాలరు. ఎందుకంటే మనకి ఆంగ్లవ్యాకరణం ఒక్కటే వచ్చు. గ్రీక్, లాటిన్ వ్యాకరణాలు రావు. అవి ఇంగ్లీషువాళ్ళకే వచ్చు. Further coinage కోసం వారి మొహాలవైపు కోరపక్షుల్లా ఎదురుచూడ్డం తప్ప మనమేమీ చెయ్యలేం. కనుక ఆ భాషాపదాల మీద అంతగా ఆధారపడ్డప్పుడు అది మనకి ఒక అంగవైకల్యంగా, పరాశ్రయతగా పరిణమిస్తుంది. ఆ విదేశీ పదాల్ని దాటి మన భావనలు ఎదిగినప్పుడు ఆ విదేశీభాషలో ఆ భావనలకి వ్యక్తీకరణలు లభించక, ఆ వ్యక్తీఖరణలు చెయ్యడానికి మనకి స్వేచ్ఛ లేక, గ్రీక్, లాటిన్ వ్యాకరణ సంప్రదాయాల పరిజ్ఞానలోపం వల్ల అది సాధ్యపడక మనం మెదళ్ళు బ్లాక్ అవుతాయి. ఇక్కడ సృజనాత్మకత ఇంగ్లీషువాళ్ళచే్తిలో బందీగా మారిపోతుందని అది వారి పదాలతో పాటు మనదాకా ప్రవహించదని గ్రహించాలి.
దీని పరిష్కారం ఏంటి ? మన ఇంగ్లీషుమీడియమ్ బళ్ళలో ఇహముందు ప్రతివాడికీ ఇంగ్లీషుతో పాటు గ్రీకూ, ల్యాటిన్ కూడా నేర్పించడం మొదలుపెడదామా ? అది హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే ఎవరో కొందఱు మేధావులు తప్ప అచ్చమైన ఇంగ్లీషువాళ్ళే వాటిని ఇప్పుడు నేర్చుకోవడం లేదు. పాపం, ఎన్నని నేర్చుకుంటారు పిల్లలు బళ్ళలో ? భాష నుంచి భౌతికశాస్త్రం దాకా, సెక్సు నుంచి యోగా దాకా వాళ్ళ మెదళ్ళని చితక్కొడుతున్నారిప్పటికే !
దీనికి అసలైన పరిష్కారం ఉన్నది - మనం ఇంకా ఇంకా విదేశీ పదాల ఱొంపిలో ఱొచ్చులో పీకల దాకా దిగబడ్డంలో కాదు. మన వ్యాకరణ సంప్రదాయాల్ని మనం కూలంకషంగా నేర్చుకోవడంలో. మఱుగున పడ్డ దేశీ పదాల్ని నూతన జవసత్త్వాలతో పునరుద్ధరించడంలో. మన భాషానిర్మాణాల్ని సక్రమంగా అవగాహన చేసుకొని కొత్త పదాల కల్పనకి ఆ సూత్రాల్ని వినియోగించుకోవడంలో ! అప్పుడు ఇంగ్లీషువాళ్ళకి తమ భాషలో Further coinage ఎలా సాధయమవుతున్నదో మనవాళ్ళకి మన భాషలో అది అలా సాధ్యమవుతుంది.
కానీ మనమేం చేస్తున్నాం ? మనం ఇదేదీ చెయ్యకుండా భాషాపరంగా ఒక సోమరి మార్గాన్ని ఎంచుకున్నాం. అదేంటంటే పదాల్ని ఇంగ్లీషు నుంచి అనంతంగా దించుకోవడం, దించుకోవడం, దించుకోవడం... ఈ దించుకోవడానికి అంతులేదు. ఎందుకంటే మన భావదారిద్ర్యానికి అంతులేదు. దీనివల్ల మన మేధో ఆరోగ్యానికి జఱిగిన నష్టం గుఱించి ఎక్కువమందికి అవగాహన లేదు. మనకి పదాలతో పాటు భావాలు కూడా పుట్టడం మానేశాయి. దానిక్కూడా ఇంగ్లీషువాళ్ళ మొహం వంక చూస్తున్నాం. ఏ పరిశోధనైనా వాళ్లే చెయ్యాలి. వాళ్ళే అన్నింటికీ పేర్లు పెట్టాలి. ఆ పేర్లనుంచి ఉద్భవించే కొత్త భావాలక్కూడా వాళ్ళే పేర్లు పెట్టాలి. ఇదీ మన పరిస్థితి.
సంస్కృతం ద్రవిడ బాష కాదు. మరి
సంస్కృతం ద్రవిడ బాష కాదు. మరి తెలుగులో సంస్కృత పదాలు ఎందుకు కలుపుతున్నాం? శ్రీకాకుళం మాండలికంలోని రక్తం సంస్కృత పదమే. రాయలసీమ మాండలికంలోని నెత్తురు అసలైన ద్రవిడ పదం. దక్షిణ ఒరిస్సాలోని గజపతి, రాయగడ, మల్కనగిరి జిల్లాలలో ఒరియాలో తెలుగు పదాలు కలుపుతారు. తెలుగు ఆర్య బాష కాదు. దక్షిణ ఒరిస్సా ప్రజలు ఒరియాలో తెలుగు పదాలు ఎందుకు కలుపుతున్నట్టు? ఒరియా సంగతి సరే, హిందీ బాషలో కూడా కొన్ని ద్రవిడ పదాలు ఉన్నాయి. 60 ఏళ్ళ క్రితం బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించారు కనుక భారతీయ బాషలలో ఇంగ్లిష్ పదాలు కలవడం విచిత్రం కాదు. ఇంగ్లాండ్ ని రోమన్ సామ్రాజ్యవాదులు ఒకప్పుడు పరిపాలించారు కనుక ఇంగ్లిష్ బాషలో లాటిన్, గ్రీక్ పదాలు ఎక్కువ ఉండడం కూడా విచిత్రం కాదు.
తెలుగూ, సంస్కృతమూ వే్ఱువేఱు
తెలుగూ, సంస్కృతమూ వే్ఱువేఱు భాషలు కావు. సంస్కృతం భారతదేశానికి దేశీయమైన స్థానిక భాష. అవి సారూప్యమైన పదాలూ, వ్యాకరణ నిర్మాణాలూ కల సహచర భాషలు (allied languages). ఈ ఆర్య-ద్రావిడ భేదం ఇంగ్లీషువారి హయాములో ప్రచారం చేయబడింది. మన పూర్వీకులకి ఈ తేడా తెలియదు. తెలుగువారికి సంస్కృతం మాతృభాష లాంటిదే. సంస్కృత సమాసాల్ని తెలుగువారు ప్రత్యేక శిక్షణ లేకుండానే కల్పించగలగడం ఇందుకు నిదర్శనం. మీరడిగారు కాబట్టి ఇది చెప్పాను గానీ ఇప్పుడిది సందర్భసహితం కాదు.
అసలు విషయం - మన భాషలతో పదాల్లో గానీ, వ్యాకరణంలో గానీ వాక్య నిర్మాణాల్లో గానీ, వాడుకలో గానీ, ఏ విధమైన పోలికా లేని భాషల నుంచి పదాల్ని అదే పనిగా తీసుకోవడం వల్ల మనలో భాషాపరంగానే కాక భావపరంగా కూడా స్వకీయతా, సృజనాత్మక శక్తీ నశించి పోతాయి. అంతిమంగా మన భాషే నశిస్తుంది. ఎందుకంటే ఆ భాషవాళ్ళు మనకి నేర్పినదాన్ని మించి ఆ భాషలో మనం ముందుకు వెళ్లలేం. మన దృష్టి (perception) ఆ భాషాపదాల చేత అలా పరిమితం కావించ బడుతుంది.
మీరు వయసులో చిన్నవారు కావడం చేత, తెలుగు మీడియమ్ క్షీణించిన తరువాత జన్మించినవారు కావడం చేత గతంలో తెలుగు అకాడమీవారు అభివృద్ధి చేసిన తెలుగు సాంకేతిక పదజాలం గుఱించి గానీ, వారు వందలాదిగా ప్రచురించిన తెలుగు మీడియమ్ శాస్త్ర గ్రంథాల గుఱించి గానీ మీకు తెలిసే అవకాశం లేదు. తెలుగులో శాస్త్ర సాంకేతిక పదజాలం లేదనే భ్రమలో మీరు వాదిస్తున్నారు. అదీగాక మీరు వాదాన్ని వాదం కోసమే వాదిస్తున్నట్లు కనపడుతోంది. అలాంటి కార్యకలాపం పట్ల నాకు ఆసక్తి లేదు. విషయాన్ని గ్రహించగలవారికి నేనింతవఱకు ఇక్కడ అందించిన సమాచారం సరిపోతుందనుకుంటున్నాను. కనుక ఈ సైట్ లోని ఈ చర్చ నుంచి నేనింక విరమిస్తున్నాను.
నేను అలా అనుకుంటానని మీరు
నేను అలా అనుకుంటానని మీరు ఎందుకు అనుకున్నారు? మీ సమాధానం నచ్చకపోయినా అది అసందర్భపు సమాధానం అనుకోను. మీ అభిప్రాయం మీరు చెప్పారు అనుకుంటాను, అంతే. మనం హిందూ మత ప్రభావం వల్ల తెలుగులో సంస్కృత పదాలు కలపడం పై అభ్యంతరం చెప్పడం లేదు కానీ తెలుగులో యూరోపియన్ బాషల పదాలు కలపడాన్ని మాత్రం అంగీకరించలేకపోతున్నాం.
గోపాల్ గారూ ! ఈ పైన రెండో
గోపాల్ గారూ ! ఈ పైన రెండో వ్యాఖ్యని తొలగించండి.
తొలగించాను. తాడేపల్లి గారూ,
తొలగించాను.
తాడేపల్లి గారూ, మీరందంచిన సమాచారం చాలా విలువైనది, ఇది చూసైనా కొంతమంది మారతారని ఆశిస్తున్నాను. నెనర్లు!
ఇప్పటి వరకు తెలుగు బాషావాదం
ఇప్పటి వరకు తెలుగు బాషావాదం లేవనెత్తిన వాళ్ళెవరూ తెలుగు బాషే శ్రేష్టమైనది అని నిరూపించలేకపోయారు. నేను ఇంగ్లిష్ అర్థం కాని వాళ్ళ కోసం తెలుగు అనువాదాలు వ్రాస్తున్నాను కానీ తెలుగు మీద అభిమానంతో కాదు.
ఆ శ్రేష్టతకి మీరిచ్చే భాష్యం
ఆ శ్రేష్టతకి మీరిచ్చే భాష్యం ఏంటో తెలుసుకోవచ్చా? ఇంగ్లీషు భాష, ఆ తెల్ల దొరలు అక్రమంగా పాలించి వెళ్ళిన కారణాన, చాలామంది మాట్లాడాతున్నారు అని తప్ప, దాని కున్న ఆ ఎక్ష్ట్రా శ్రేష్టత ఎంటో చెప్పగలరు. అక్కడ జరిగేది, ఇక్కడ జరగనిది ఏంటో తాడేపల్లిగారు వివరంగా రాశారు. ఆ బుద్ది జనంలో ఉంటే భాషకి కూడా సొబగులొస్తాయి. సాగునేలలో పంట పండిచలేకపోవడం నేలకి సత్తువ లేకపోవడం కాదు, రైతుకి మనసు లేకపోవడమే.
నేనేమీ తెలుగు మాట్లాడేవాళ్ళని
నేనేమీ తెలుగు మాట్లాడేవాళ్ళని ఎగతాళి చెయ్యడం లేదు. ఎగతాళి చేసే రకం అయితే తెలుగు అనువాదాలు వ్రాసేవాడినే కాదు.
నా ఉద్దేశ్యం కూడా అది కాదు.
నా ఉద్దేశ్యం కూడా అది కాదు. నేనడిగిన ప్రశ్నకు సమాధానం మీరింకా ఇవ్వనేలేదు - మీరనుకునే శ్రేష్టతకి భాష్యం ఏంటి అని?
నా దృష్టిలో ఏ బాషా శ్రేష్ఠమైన
నా దృష్టిలో ఏ బాషా శ్రేష్ఠమైన కాదు. All languages are mongrelised. Even English is highly mongrelised with German, Latin and Greek words. Telugu is more mongrelised with Tamil and Kannada words than Sanskrit or English words. ఏ పర బాషా పదాలూ కలవని శ్రేష్ఠమైన బాష ఎక్కడా లేదు.
"తెలుగు బాషే శ్రేష్టమైనది
ఒకదానికి ఒకటి సరిపోవడం లేదు ప్రవీణ్ గారూ. మీకు అభిమానం లేకపోవచ్చుగానీ చులకన భావన ఉంటే మటుకు చెరిపేయండి. ఉన్నట్టు పైన మీరన్న రెండు వాఖ్యాలు చెప్తున్నాయి.
నా మాటల్లో హిడెన్ ఇంటెన్షన్స్
నా మాటల్లో హిడెన్ ఇంటెన్షన్స్ లేవు. నేను తెలుగు మాట్లాడే కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నాకు తెలుగు, ఇంగ్లిష్ ఈ రెండు బాషలూ వచ్చు కాబట్టి ఇంగ్లిష్ రాని వాళ్ళ కోసం ఇంగ్లిష్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను. నేను ఏ బాషకీ టాప్ ప్రయారిటీ ఎన్నడూ ఇవ్వలేదు.
manchi vivarana. chadivaka
manchi vivarana. chadivaka nijame ani pinchindi.
Post new comment